Thursday, June 15, 2017

Sugunas of Rama from Chaganti Koteshwara rao's discourse

చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనముల నుండి నేను రాసుకున్న కొన్ని ఆణిముత్యాలు

ఉత్తమమధ్యమాదములు

ఆటంకాలు కలుగుతాయనీ, శ్రమ పడాలని బయపడి అధములు పని మొదలుపెట్టరు. మధ్యములు ఆటంకాలు కలిగాయని మొదలుపెట్టిన పనిని మధ్యలోనే ఆపేస్తారు. ఉత్తములు మొదలుపెట్టిన పనిని ఉత్సాహంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా పూర్తి చేస్తారు. గమ్యం పై ఎంత శ్రద్ద వుందో గమనం పై కూడా అంతే శ్రద్ద ఉండాలి

కష్టం

రాముడికి సీతకు వచ్చిన కష్టం ముందు మనకొచ్చిన కష్టం ఏపాటిది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నడూ సత్యధర్మాలను రాముడు విడనాడలేదు.  ఒక మాట ఎలా మాట్లాడాలో, ఆడిన మాటకు ఎలా కట్టబడాలో రాముడి జీవితం మనకు నేర్పుతుంది. ఎక్కడ రాముడి కథ జరుగుతుందో అక్కడ హనుమ వస్తారు

కర్మలు

నీ పాపంతో సంపాదించిన ధనము అనుభవించే వాళ్లు నీ పాపం లో వాటా తీసుకోరు. జీవితంలో గొప్పది గురువుని జ్ఞాపకం చేసుకోవడం. ఆయన చెప్పిన విషయాలను గుర్తుచేసుకోవడం. రోజు చేసే పనులను నిత్యకర్మలు అంటారు. ప్రత్యేక రోజులలో చేసే కర్మలను నైమిత్తిక కర్మలు అంటారు.

మనసు 

మనసు తనకి ఏది ప్రీతిపాత్రమో దాని చుట్టూ  తిరుగుతూ ఉంటుంది అదే దాని బలము బలహీనత కుడా. దానికి దైవాన్ని ఆలంబనగా ఇవ్వాలి. శత్రుజ్ఞుడు అంతఃశత్రువులను గెలిచాడు. అహంకార మమకారాలను గెలిచాడు. పోలిక పోల్చుకొనుట మనసు యొక్క తత్వము. ప్రతికూలత వున్నప్పుడు పోల్చుకుంటుంది.

రామలక్ష్మనభరతశత్రుజ్ఞులు

లక్ష్మణ శత్రుజ్ఞులు కవలలు. భరతుడు ఒక పూట ముందు పుట్టాడు. రాముడు ధర్మము. లక్ష్మణుడు అనుష్టానము. భరతుడు భక్తి. శత్రుజ్ఞుడు శక్తి. భగవంతుడికి తన సేవ కన్నా భాగవతుల సేవ ఎక్కువ ప్రీతికరము. అందుకే నంది, చండీశ్వరుడు, ఆళ్వార్లను సేవించి దేవాలయంలోకి వెళ్ళాలి. భగవంతుడికి సేవ చెయ్యడం సులువు. భాగవతులు సేవ చెయ్యడం కష్టం. భరత శత్రుజ్ఞులు మేనమామ ఇంట్లో ఎన్ని భోగములు అనుభవిస్తున్నా సర్వకాలముల యందు తల్లితండ్రులను స్మరించేవారు.

రాముని సుగుణములు 

రాముడెప్పుడు నిర్మల చిత్తముతో ఉండేవాడు. ఎవరికీ పుట్టుకతో మనసు చెడ్డది కాదు. మనసు తప్పక మారుతుంది. ఆశ్రయించిన వస్తువుని బట్టి మారుతుంది. ఎప్పుడూ దోషాలు తవ్వితే ప్రశాంతత ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటే మాట మృదువుగా ఉంటుంది. వాక్కుని నిగ్రహించాలి. బేధాభిప్రాయాలు గుర్తుచేసుకోకూడదు. ఎవరైనా కర్కశంగా మాట్లాడితే రాముడు మౌనం పాటిస్తాడు. ఉద్రేకపడి వెర్రికేకలు వేసేవాడితో మానం పాటిస్తే వాడితో స్నేహం కుదరదు. నాలుగు సార్లు అరుస్తాడు. అయిదోసారి వెళ్ళిపోతాడు.

రాముడు తనకెవరైనా అనుకోకుండా ఉపకారం చేస్తే వాడెన్ని తప్పులు చేసినా వాటిని పరిగణించకుండా ఉపకారం చేస్తాడు. మనల్ని మనం రోజు పరిశీలించుకోవాలి. ఒక రోజులో ఎన్ని సంకల్పాలలో ఇతరులను ప్రేమించామో ఎన్ని సందర్భాలలో ఇతరులను ద్వేషించామో. రాముడు అనుకోకుండా ఒక్క ఉపకారం చేసినా తలుచుకు తలుచుకు పొంగిపోతాడుట. నాకు ఉపకారం చేసేవాళ్ళు ఇంతమంది వున్నారని సంతోషంగా ఉంటాడు. పరదూషణ చేయడు. నిష్పక్షపాతంగా కష్టమైనా మంచి వైపు నడుస్తాడు.

పూర్వబాషీ ప్రియంవద. నేను పలకరించడమేంటి వాడే వచ్చి పలకరించాలి అనే అహంకారము లేనివాడు. అలా అని పిచ్చి పిచ్చిగా పలకరించడం కాదు. అయ్యా బావున్నారా కులాసా ఏనా అని అడగటానికి అహంకారాన్ని జయించాలి. అవతలి వాళ్ళని చూడగానే వాళ్లలో మంచి గుర్తుచేసుకుంటాడు. ముందు మాట్లాడతాడు, ప్రియంగా మాట్లాడతాడు. ప్రేమతో మాట్లాడతాడు. అక్కసుతో కూడిన మాటలు మాట్లాడడు. ఎంత పరాక్రమవంతుడైన అహంకారం లేదు. నలుగురి తో సులభంగా కలుస్తాడు. ఎప్పుడూ అసత్యం ఆడడు. పెద్దలొస్తే ఎదురెళ్లి రండి రండి రండి అని చెయ్యి అందిస్తాడు. ధర్మవిరుద్ధమైన మాట మాట్లాడేవాడు కాదట. శ్రేయస్కరము కాని కార్యము చెయ్యడట. ఆ తప్పేలే వాడు చెయ్యలేదా వీడు చెయ్యలేదా అని శ్రేయస్కరము కాని పని చెయ్యడట. ధర్మబద్ధమైన మాట అయితే అవతలివాళ్ళు ఎవరైనా గౌరవిస్తాడట.

ఎన్ని చదువులు వున్నా ఆ సమయానికి జ్ఞాపకం రావాలి. సమయస్ఫూర్తి ఉందట. వ్యవహార ఆచారాలు తెలుసట. ఆర్జన, వ్యయం న్యాయబద్దంగా ఉండాలి. సంగీతం, నృత్యం, గుర్రాలని, ఏనుగులను స్వారీ చెయ్యగలడు. అతిరతులలో శ్రేష్ఠుడు. నిష్కారణంగా బాణప్రయోగం చెయ్యడు. ఓర్పుతో ఉంటాడు. ధర్మాన్ని లక్ష్మిని కలపడం తెలుసు. ముందు ధర్మం తరువాత అర్ధకామములు. అధర్మంగా  తెస్తే అశాంతి. అది  అధర్మంగానే పోతుంది. ఎవడు పట్టుకుపోతాడో అని బెంగ ఉంటుంది. రాముడిని చూస్తే చంద్రుడిని చూసినంత ఆనందం కలుగుతుంది. భూమి కున్న ఓర్పు, బృహస్పతికున్న బుద్ది ఇంద్రుని శక్తి. విజయం తరువాత ప్రతివాళ్ళని పిలిచి పలకరిస్తాడంట. ప్రతి ఇంటిముందు వెళ్తూ ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. తాను అనుభవించకపోయిన తన వారు అనుభవిస్తే సంతోషిస్తోచడమే ప్రేమ